గీతా సందేశము
(Thanks to Shravan and Vamshi for translating this.)
భగవద్గీత మనకు వేదాల సారాన్ని అందిస్తుంది. వేదములు హిందూ ధర్మము యొక్క పునాది. కనుక గీతా సందేశము వేదముల సందేశము, హిందూ ధర్మ సందేశము.
జీవితం యొక్క ప్రయోజనం, “ఆనందంగా ఉండటము మరియు ఇతరులకు సహాయం చేయడం”. ఇది మంచిగా ఉండటం, మంచి చెయ్యడం వల్లే సాధ్యం అవుతుంది.
లక్ష్యం
జీవితంలో ఏ పరిస్థితిలోనైనా మనకు ఆనందంగా ఉండే స్వేచ్ఛ ఉంది (2-11) . సమస్యలు ఉంటూనే ఉంటాయి. మనo పనులు (కర్తవ్యం) చేస్తూనే సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ ఆనందాన్ని కోల్పోకూడదు. ఆనందం అనేది మన స్వభావం అవ్వాలి, అది మనుషులపై, వస్తువులపై, పరిస్థితులపై ఆధారపడి ఉండకూడదు. మనము ఆనందంగా ఉండదలచుకొంటే, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితిలోనైనా ఆనందంగా ఉండొచ్చు.
ఈ సత్యాన్ని అర్థం చేసుకొని, అనుభవంలోకి తెచ్చుకుంటే జీవితం ఆనందంగా, శాంతిగా ఉంటుంది. ఇలా ఉండటానికి కింది అవరోదాలు అడ్డుపడవచ్చు.
1. బద్దకం (ఉత్సాహము లేకపోవడం)
2. మనుషులపై, వస్తువులపై మరియు పరిస్థితులపై ఆధారపడి ఉండటం
3. మనస్సుపై, ఇంద్రియములపై నిగ్రహము లేకపోవడం
4. నేను, ఈశ్వరుడు(దేవుడు) మరియు జగత్తు (ప్రపంచం), వీటిపై సరియైన అవగాహన లేకపోవడం
భగవద్గీత మనల్ని క్రమక్రమంగా ఈ అవరోధాల్ని దాటేలా చేస్తుంది (5-7).
నేను ఎవరు?
నేను నా జీవితానికి బాధ్యున్ని. నా జీవితంలో జరిగే ప్రతీ ఘటనకూ నేను ఈ జన్మలో లేదా పూర్వ జన్మలలో చేసిన కర్మలు(ఆలోచనలు, మాటలు, పనులు) కారణం (6-41 నుంచి 6-42 వరకు). నేను ఇప్పుడు చేసే కర్మపై నాకు స్వేచ్ఛ ఉంది. అందువలన నా కర్మకి ఫలితం ఇప్పటీ మరియూ ఇంతక ముందు కర్మలపై ఆధారపడి ఉంటుంది (2-47)
నా శరీరం, మనస్సు నా కర్మలకు సాధనాలు (ఉపయోగించే పరికరాలు). కాబట్టి నేను నా శరీరం, మనస్సు కాదు. నేను వాటిని వాడుతూ ప్రపంచానికి నన్ను వ్యక్త పరుస్తున్నాను. నేను ఏం చెయ్యాలో నిర్ణయించే జీవుడుని. ఇతర పరికరాల వలె, ఉదాహరణకు నిప్పు, విద్యుత్, అణు శక్తి వలె, మన అధీనంలో ఉన్నంతవరకూ అవి మనకు స్నేహితులే. వాటిని వాడుతూ ఎన్నో సాధించవచ్చు. అదే అవి మన అదుపు తప్పితే, మన శత్రువులుగా మారి పతనానికి దారి తీస్తాయి (6-5, 6-6).
నా శరీరం చనిపోయినప్పుడు, నేను మనస్సుతో పాటు వేరొక కొత్త శరీరాన్ని తీసుకుంటాను (15-8). అందువలన నా కర్మల ఫలితాన్ని ఈ జన్మలోనైనా, వచ్చే జన్మలలోనైనా ఖచ్ఛితంగా అనుభవించి తీరవలసిందే. మరణం తరువాత శరీరం మార డమనేది చిరిగిన దుస్తులు విడచి కొత్త దుస్తులు వేసుకోవడం వంటిది (2-22). మరణం కూడా బాల్యం, యవ్వనం, ముసలితనం వంటి ఒక మార్పు మాత్రమే. ఇవి శరీరంలో మార్పులు అయితే, మరణం శరీరాన్ని మార్చడం (2-13). వాస్తవంలో నేను పుట్టను, మరణించను(2-20). ఈ మార్పు శరీరానికి మాత్రమే.
ఈశ్వరుడు ఎవరు?
విశ్వంలో ఉన్నదంతా ఈశ్వరుడే. ఈ విశ్వం ఈశ్వరుని భౌతిక శరీరం. అందరి మనస్సుల యొక్క ఆలోచనలు ఈశ్వరుని మనస్సు. భౌతిక మరియు నైతిక ధర్మాలు ఈశ్వరుని ఇచ్ఛ. (7-4 నుండి 7-7).
ఈశ్వరుడే అన్నింటి సారం. నీటిలో రసము, అగ్నిలో వేడి, బుద్ధిమంతులలో బుద్ధి, బలవంతులలో బలం, ఈశ్వరుడే. చేతన జీవులలో చైతన్యం ఈశ్వరుడే. ఎలా అయితే విద్యుత్తు వివిధ పరికరరాల్ని ప్రకాశింపజేస్తున్నదో అలాగే చైతన్య రూపంలో ఈశ్వరుడు, ప్రాణులను చైతన్య జీవులలా ప్రకాశింపచేస్తున్నాడు. (18-61, 13-2, 10-20).
ఈశ్వరుడు కాకుండా వేరే ఏదీ లేదు. కుండకు మట్టి మరియు కుమ్మరి అని రెండు కారణాలు ఉన్నాయి. మట్టి ఉపాదాన కారణము, కుమ్మరి నిమిత్త కారణం. కానీ జగత్తు విషయంలో నిమిత్త ఉపాదాన కారణాలు రెం డూ ఈశ్వరుడే (10-20). ఎలాగైతే, అల సముద్రంలో పుట్టి, సముద్రంలో ఉండి, సముద్రంలో విలీనమవుతుందో, అలాగే జగత్తు కూడా ఈశ్వరునినుంచి వచ్చి ఈశ్వరునిలో ఉండి, ఈశ్వరునిలో విలీనమవుతుంది.
ఇలా అర్థం చేసుకున్న ఈశ్వరున్ని మనం ఏ పేరుతోనైనా, ఏ రూపంలోనైనా పూజించవచ్చు (7-21). ఇది సందర్భం పైన మరియు భక్తుని కోరిక పైన ఆధారపడి ఉంటుంది. ఏదైనా పని ఆరంభిస్తున్నప్పుడు, ఈశ్వరున్ని గణపతిలా, వ్యాపారంలో లాభం రావాలని ప్రార్థిస్తున్నప్పుడు లక్ష్మీలా, చదువును కోరినప్పుడు సరస్వతిలా పూజిస్తాం. అలాగే నన్ను నేను దేశ భక్తునిలా అనుకొన్నప్పుడు ఈ ఈశ్వరుడే భారతమాత, భూమి పైన పుట్టిన ప్రాణిని అనుకొన్నప్పుడు భూమాతా, కర్మలు చేస్తున్న వాన్ని అనుకొన్నప్పుడు కర్మ ఫలదాత. నేను వైష్ణవున్ని అనుకున్నప్పుడు ఈశ్వరుడు విష్ణువు, శైవున్ని అనుకొన్నప్పుడు శివుడు. అంతేకాదు ఈశ్వరున్నీ మనం తల్లిగా, తండ్రిగా, శిశువుగా, గురువుగా, మిత్రుడుగా, యజమానిగా కూడా పూజించ వచ్చు.
ఎప్పుడైతే మనిషిలోని మంచితనంపై నమ్మకం సన్నగిల్లుతుందో అప్పుడు ఈశ్వరుడు ధర్మాన్ని కాపాడడానికి, నమ్మకాన్ని పునరుద్దరించటానికి అవతరిస్తాడు (4-7, 4-8). ఈ అవతారాల రూపంలోనూ ఈశ్వరున్ని పూజించవచ్చు.
కర్మ యోగము
ఈశ్వరుడు విశ్వమంతా వ్యాపించిన తత్త్వము. మన జీవితంలో వివిధ పాత్రలు మనం పోషిస్తుంటాము: తల్లి, తండ్రి, అన్న, అక్క, విద్యార్థి మొదలైనవి. మనం ఏ పాత్ర పోషించినా దానికి అనుగునంగా అవతలి పాత్ర ఈశ్వరుడే పోషిస్తాడు (7-21). ఇలా మనం పరస్పరం ఈశ్వరునితోనే వ్యవహరిస్తాము. మనం చేసే ప్రతి పని ఈశ్వరునికి మనమిచ్చే బహుమతి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతీదీ ఈశ్వరుడి నుంచి వచ్చే బహుమతి. (9-27)
మనం ఇంతక ముందు చర్చించిన బద్దకం మొదలైన అవరోదాల్ని తొలగించడానికి మూడు సాదనల్ని పాటించవచ్చు. అవి, యజ్ఞము, దానము మరియు తపస్సు.
యజ్ఞము – పంచ మహా యజ్ఞములు (3.11, 4.28)
1. దేవ యజ్ఞము – (ప్రకృతి పట్ల మన కర్తవ్యాలు)
ప్రకృతిని రక్షించాలి, కలుషితం చేయకూడదు. చెట్లని నాటాలి. వనరుల్ని ఆదా చేయాలి. మన జీవితంలో జరుగుతున్న మంచికి కృతజ్ఞతగా రోజూ ఈశ్వరున్ని ప్రార్థించాలి. తరుచుగా గుడికి వెళ్ళాలి.
2. భూత యజ్ఞము – (ఇతర ప్రాణుల పట్ల కర్తవ్యాలు)
జంతువుల్ని రక్షించాలి. వాటికి గౌరవం ఇవ్వాలి. వాటికి హాని కలిగించరాదు.
3. మనుష్య యజ్ఞము – (సమాజం పట్ల కర్తవ్యాలు)
జనులకు సాయం చెయ్యాలి. అందరికి గౌరవం ఇవ్వాలి. సమాజ సేవా సంస్థలతో పని చెయ్యాలి లేదా వారికి సహాయ పడాలి. ఇతరుల నుంచి పొందిన సేవకు, వస్తువులకు తగిన మూల్యం చెల్లించాలి.
4. పితృ యజ్ఞము – (వంశము పట్ల కర్తవ్యములు)
తల్లిదండ్రులను, పెద్దలను, పిల్లలను బాగా చూసుకోవాలి. వృద్ధులను గౌరవించాలి, సహాయం చెయ్యాలి. దేహం వదిలేసిన పూర్వీకుల మంచి కొరకు ప్రార్థించాలి. పిల్లల పట్ల ప్రేమగా ప్రవర్తించాలి. అనాదాశ్రమాలతో, వృద్ధాశ్రమాలతో కలిసి పనిచెయ్యాలి లేదా వారికి సహాయం చెయ్యాలి.
5. ఋషి యజ్ఞము – (సంస్కృతి పట్ల కర్తవ్యములు)
గురువులకు సహాయం చెయ్యాలి. జ్ఞానాన్ని పొందాలి, వృద్ధి చేయాలి మరియు ప్రచారం చెయ్యాలి. పిల్లల, పెద్దల విద్య కొరకు సహాయం చెయ్యాలి. చదువుకొనే తాహత లేని వారికి సహాయం చేసే సంస్థలతో పని చెయ్యాలి లేదా వారికి సహాయం చెయ్యాలి. విజ్ఞానం, గణితం, సాహిత్యం, సంగీతం, నాట్యం, తత్త్వ శాస్త్రం, మతం మొదలైన వాటిని నేర్చుకోవాలి, వాటి అభివృద్ధికి తోడ్పడాలి.
దానం
డబ్బు, సమయం, వస్తువులు, జ్ఞానం వీటిని అవసరం ఉన్నవారికి ఇచ్చే అలవాటుని అలవరుచుకోవాలి. దానం చేసేటప్పుదు గర్వం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, బాధ్యతగా చెయ్యాలి (17-20).
తపస్సు – (పది సద్గుణాలు)
ఈ క్రింది సద్గుణాలు పతంజలి యోగసూత్రాల నుంచి తీసుకొనబడినవి. భాగవద్గీతలో కూడా వీటిని వేరే కోణంలో చెప్పడం జరిగింది (13-7 నుంచి 13.11 వరకు, 16-1, 16-2, 16-3, 17-14, 17-15, 17-16).
1. సత్యం – అసత్యము చెప్పరాదు. ఎప్పుడూ మనకి తెలిసిన నిజాల్ని చెప్పన్నక్కరలేదు. కానీ మనం ఏ పని చేసినా, ఏంమాట్లాడినా మన జ్ఞానం, భావన, మాట మరియు పనికి పొంతన ఉండాలి.
2. అహింస – వేరొకరి బలహీనతను ఆసరాగా తీసుకోరాదు. ఏ ప్రాణికి హాని చేయకుండా బ్రతకడం సాధ్యం కాదు కానీ సాధ్యమైనంత వరకూ హాని చేయకుండా వుండాలి. ఎవరికీ హాని జరగాలని కోరుకోరాదు.
అహింసను ఆలోచనలలో, మాటల్లో, పనులలో పాటించాలి. అందరికీ సహాయం చేయలి.
3. బ్రహ్మచర్యము – ఇతర లింగము గల వ్యక్తి పట్ల(స్త్రీ పురుషుడి పట్ల, పురుషుడు స్త్రీ పట్ల) అగౌరవంగా అనుచితంగా ప్రవర్తించరాదు. ఉచితంగా పరవర్తించడం అంటే జనులను మనషుల్లా భావించి పరవర్తించడం, వారిని వస్తువుల్లా చూడకపోవడం. ఇది పెళ్లికానివారికి సంపూర్ణ బ్రహ్మచర్యము, పెళ్లి అయినవారికి వివాహ బంధంలో పవిత్రత.
4. ఆస్తేయము – న్యాయము కాని (అధర్మమైన) సంపదను పొందరాదు.
5. అపరిగ్రహము – ఆవశ్యకమైన దానికంటే ఎక్కువ కలిగిఉండటం లేదా వృధా చేయరాదు. సాధారణమైన జీవితాన్ని గడపాలి.
6. శౌచము – అన్నింటిని శుచిగా(శుభ్రంగా) ఉంచాలి. ఇది పరిసరాలకు, శరీరానికి మరియు మనస్సుకు వర్తిస్తుంది.
7. సంతోషము – ఎప్పుడూ ఉల్లాసంగా, సంతృప్తిగా ఉండాలి. ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉండరాదు. మాటల్లో, పనుల్లో ఉల్లాసాన్ని, సంతృప్తిని వ్యక్తం చెయ్యాలి.
8. తపస్సు – జీవితం క్రమశిక్షణతో జీవించాలి. లేవడం, తినడం, పడుకోవడం మొదలైనవి సరైన సమయంలో చెయ్యాలి. మనం ఏవైతో తింటామో, చదువుతామో, చూస్తామో, మాట్లాటాడతామో, ఆలోచిస్త్తామో, వాటి పట్ల నియంత్రణ కలిగి ఉండాలి. మన మనస్సును అర్థం చేసుకునేందుకు, ఆలోచనలను నియంత్రించేందుకు ప్రతీ రోజు ధ్యానం చెయ్యాలి.
9. స్వాధ్యాయము – మంచి ఆలోచనలే మనం చెయ్యాలి. మంచి పుస్తకాల్ని లోతుగా చదవడం, అర్థం చేసుకోవడం, వాటి పట్ల ఆసక్తి ఉన్నవారితో చర్చించడం చెయ్యాలి.
10. ఈశ్వర ప్రణిధానము – జీవితంలో వచ్చే ప్రతీదీ న్యాయంగానే వస్తుంది. సృష్టిలో ఉన్న ఈ న్యాయాన్ని నమ్మాలి. “ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి ఫలాలే వస్తాయి”. చేసే ప్రతీ కర్మను ఈశ్వరుని అర్పించాలి, వచ్చే ఫలాన్ని ఈశ్వరుని బహుమతిలా స్వీకరించాలి. గెలుపు వినయంతో స్వీకరించాలి, ఓటమితో ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు.
ప్రయోజనకరమైన కోరికలు ఉండడములో తప్పేంలేదు, వాటిని మనం సాధించాలి కూడా. కానీ అవి ఈ మూడు ప్రమాణాల్ని కలిగి ఉండాలి:
1. న్యాయమైనవి, నైతికమైనవి మరియు ఎవరికీ హాని కలిగించనివి.
2. మితమైనవి(తీవ్రం కానివి). అవి యజ్ఞము, దానము, తపస్సులను నిష్కామంగా (ఫలితం గూర్చి చింతలేకుండా) చెయ్యడంలో అడ్డురాకూడదు.
3. బంధించనివి. వాటిని పొందడంలో ఆరాటం ఉండరాదు. పొందిన తరువాత అహంకారం, గర్వం రాకూడదు. పొందలేక పోతే క్రోధం, విచారం ఉండరాదు.
మనం ఈ లోకం నుంచి తీసుకునే దానికంటే ఎక్కువ ఇవ్వాలి. యజ్ఞము, దానము, తపస్సుల వల్ల మనస్సు శుద్ధం (పవిత్రం) అవుతుంది (18-5). చలించని, ఏకాగ్రతకల, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనే తీవ్రమైన ఆసక్తి కల మనస్సే పవిత్రమైన మనస్సు (6-27). యోగ్యమైన జీవితం శాంతిగా జీవించాలంటే ఇలాంటి మనస్సు తప్పనిసరి.
ఇలాంటి భావాల్ని అలవరుచుకోవాలంటే, అలాగే యజ్ఞము, దానము మరియు తపస్సులను ఆచరిచాలంటే సాదు-సజ్జన (మహాత్ములు, ఇలాంటి భావలపట్ల ఆసక్తి ఉన్నవారి) సాంగత్యం తప్పని సరి.
ఇంట్లో పూజ/ప్రార్థన/ధ్యానం
ధ్యానం గూర్చి గీతాలో విస్తారంగా చెప్పబడింది (6-11 నుంచి 6.14 వరకు). ఇక్కడ సులభమైన విధానం ఇవ్వడం జరిగింది.
మీరు పూజ చేసుకునే సామాగ్రి కొరకు ఒక గదిని లేదా ఒక అల్మరాను ఏర్పాటు చేసుకోండి. అందులో మీకు, మీ కుటుంబ సభ్యులకి నచ్చిన దేవతా ప్రతిమలను(ఫోటోలను), మూర్తులను (విగ్రహాలను) పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా అందంగా అమర్చండి.
రోజు ఉదయం లేదా సాయంకాలం లేదా రెండు సార్లు పూజ చెయ్యడానికి కనీసం పదిహేను నిమిషాలైనా కేటాయించండి. ప్రతిరోజూ ఒకే సమయంలో పూజ చెయ్యడానికి ప్రయత్నిచండి. ఈ సమయంలో బయట నుంచి వచ్చే శబ్దాలవల్ల పూజకు ఆటంకం కలగకుండా చూసుకోండి.
పూజచేసేటప్పుడు కుర్చీలోనైనా, నేలపై అయినా కూర్చోండి. నేలపై కూర్చోవడానికి ప్రయత్నించండి. కూర్చునేటప్పుడు ఒక బట్టను వేసుకొని దానిపై కూర్చోండి (6-11). ఈ బట్టను పూజకు తప్ప మరో పనికి వాడకండి. శరీరము, తల, మెడ సముదాయాన్ని సమముగా, కదలిక లేకుండా ఉంచండి.(6-13). శరీరమంతా విశ్రాంతిగా ఉండాలి.
మీకు నచ్చిన లేదా గురువు నుంచి స్వీకరించిన మంత్రాన్ని జపించండి. కొన్ని ప్రముఖమైన మంత్రాలు – ఓం నమ: శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్. ఒక సారి మంత్రాన్ని తీసుకున్న తరువాత దాన్ని పదే పదే మార్చకండి.
మీరు ఈ క్రింది విధానాన్ని పాటించవచ్చు:
1. మీ పూజా సమయంలో దీపాన్ని వెలిగించండి.
2. అన్నీ ప్రాణుల శ్రేయస్సు కొరకు ప్రార్థించండి.
3. ఒక స్తోత్రాన్ని కాని భక్తి గీతాన్ని కానీ కొద్ది నిమిషాల పాటు పాడండి. అర్థాన్ని గుర్తుచేసుకుంటూ పాడటం మంచిది
4. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని నిశబ్ధంగా ఉండండి
5. మీ ఛాతి మధ్యలో మీ ఇష్ట దేవత ఉన్నట్లు ధ్యానిస్తూ, మీ మంత్రన్నీ 108 సార్లు జపించండి. పెదవులు, నాలుక కదలిక లేకుండా కేవలం మనస్సులో జపించడం ఉత్తమం. అలా కుదరకపోతే ఎంత మెల్లిగా వీలైతే అంత మెల్లిగా జపించండి
6. ఏదైన ఆధ్యాత్మిక పుస్తకంలోంచి కొన్ని పుటలు (పేజీలు) చదవండి. భక్తుల జీవితాల గూర్చి, వేదాంతాన్ని బోధించే, మహాత్ముల జీవితాల్లో జరిగిన సంగటనల గూర్చి, మహాత్ములతో సంవాదాలు, వారి ఉపన్యాసాలు మరియు ఉత్తరాలు, ఇలా అన్ని విషయాలూ పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిలో ఏ పుస్తకాన్నైనా చదవవచ్చు. అధ్యాత్మిక ప్రవచనాన్ని అయినా వినండి.
7. మీ తల నేలకు తాకేలా భగవంతునికి నమస్కరించండి. మీ జీవితంలో ఉన్న శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలపండి. ఉన్నత భావలతో, కరుణతో, శాంతితో, ఇతరులకు సహాయపడుతూ జీవించడానికి కావలిసిన శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించమని కోరండి. భగవంతునికి మీ పూజా మరియు శరణాగతికి చిహ్నంగా నుదుట భస్మాన్ని లేదా కుంకుమను ధరించండి.
మీరు ఒక పుస్తకంలో భగవన్నామాన్ని108 సార్లు రాయవచ్చు. పుస్తకం పూర్తి అయ్యాక కాగితల్ని చించి వాటితో పూలు తయారు చేసి మాలలా చేసి దగ్గర్లో ఉన్న దేవాలయంలో ఇవ్వవచ్చు.
భగవంతున్ని జీవిత లక్ష్యంగా ఉంచి, చేసే అన్ని కర్మలను ఆయనకు ఆర్పిస్తూ, వచ్చే ఫలితాల్ని ఆయన నుంచి వచ్చే బహుమతులుగా స్వీకరిస్తూ, రోజూ పూజిస్తూ ఉంటే భగవంతుని పట్ల భక్తి పెరుగుతుంది (9-34).
ఈ భక్తి, జీవితంలో ఎదురయ్యే హెచ్చు తగ్గులను సమ దృష్టితో ప్రశాంతమైన మనస్సుతో ఎదుర్కొనేందుకు సహకరిస్తుంది. అన్ని సద్గుణాల్ని అలవారుచుకుంటారు. మనస్సును శుద్దంగా మరియు శాంతిగా మార్చుకుంటారు. ఇటువంటి భక్తుడే ఈశ్వరునికి ప్రియం. (12-13 నుంచి 12-19 వరకు).
జీవన విధానం
హిందూ ధర్మంలో అన్నీ కర్మలు (పూజా, ధ్యానము, యజ్ఞము మొదలైనవి), సాంస్కృతిక ఆచారాలు, పండగలు, కథలు, ఇతిహాసాలు, తీర్థయాత్రలూ మరియు కళలు ఇంతకముందు చెప్పిన విషయాల్ని జీవితంలో సాక్షాత్కరించుకునేందుకు, మనస్సును పవిత్రపరిచేందుకు తీర్చిదిద్దినవే. వీటిని ఆచరిస్తూ, అవి ఇంతవరకు చెప్పిన సిద్ధాంతాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకుంటే మనం ఉత్తమమైన సాంస్కృతిక, మానసిక, వివేకవంతమైన మరియు పూర్ణమైన జీవితం సాగించవచ్చు. ఇలా జీవించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఇవ్వబడినవి.
1. పంచ మహా యజ్ఞములు చేయండి, దానం చేయండి మరియు పది సద్గుణాలను అలవరచుకోండి
2. ఈ పుస్తకంలో చెప్పిన విధంగా ప్రార్థన చేయండి
3. రామాయణం, మహాభారతం, పురాణాలలో భక్తుల కథలు, మహాత్ముల జీవితాల్లో సన్నివేశాలు తెలుసుకోండి
4. భగవద్గీత శ్లోకాల్ని కంఠస్తం చేయండి. సాంప్రదాయ పరంగా 12వ అధ్యాయం, 15వ అధ్యాయం కంఠస్తం చేస్తారు
5. వారంలో ఒక్క రోజైన దగ్గర్లో ఉండే గుడికి కానీ ఆశ్రమానికి కానీ వెళ్ళండి
6. సంవత్సరంలో ఒక్కసారైనా ఒక పుణ్యక్షేత్రానికి తీర్థయాత్రకు వెళ్ళండి.
7. అన్నీ ప్రముఖమైన పండగలను భక్తితో, సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ జరుపుకోండి, జరగడానికి సహాయం చేయండి.
8. మీ జీవితంలో పుట్టిన రోజు, వార్షికోత్సవం, పాఠశాల/ఉద్యోగం మొదటి రోజు, పరీక్షల ముందు, వంటి ప్రత్యేకమైన రోజుల్లో దగ్గరలో ఉన్న గుడికి, ఆశ్రమానికి వెళ్ళండి.
9. శాస్త్రీయ సంగీతాన్ని, భజనలను, శ్లోకాల్ని నేర్చుకోండి.
తరువాతి మెట్టు
మనస్సు తగినంత శుద్ధమైన తరువాత, ఒక గురువుగారి వద్దకి వెళ్ళండి, ఆయననుకు సేవ చెయ్యండి. ఆయననుంచి శాస్త్రపరంగా క్రమపద్దతిలో మీ గురించి, మీకూ ఈశ్వరునికి మధ్య సంబందం గురించిన జ్ఞానాన్ని సంపాదించండి (4-23). ఆ జ్ఞానం ద్వారా ఆనందం మీ నిజ స్వరూపం అని, అది జనులపైన, వస్తువులపైన, పరిస్థితులపైన ఆధారపడదు అనే దృఢ విశ్వాసం కలుగుతుంది. అది మీలోని పూర్ణత్వాన్ని మీకు అందిస్తుంది.
మీరు ఇంకా వివరంగా చదవాలనుకుంటే, Gitaa Saaram – Essence of the Gita మరియు Tenets of Hinduism పుస్తకాల్ని చదవండి. ఈ పుస్తకాలు క్రింది వెబ్సైట్లో ఉన్నవి:
http://practicalphilosophy.in/elibrary
శ్రీ కృష్ణార్పణమస్తు